ఫ్రీడమ్ షిప్.. ఇది నీటిపై తేలియాడే నగరం
ఇంటర్నెట్ డెస్క్: వేలాది మందికి సరిపడా భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, షాపింగ్ మాల్స్, ప్రత్యేకంగా ఓ ఎయిర్‌పోర్టు.. ఇదేదో మెగా సిటీ ప్రాజెక్టు అనుకుంటున్నారా..? కాదు.. కాదు.. నీటిపై తేలియాడుతూ ప్రపంచాన్ని చుట్టే అద్భుత నగరం (Floating City). అవును.. దాదాపు 80 వేల మంది సామర్థ్యంతో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే ‘ఫ్రీడమ్ షిప్’ (Freedom Ship) ప్రాజెక్టు ఇది. ఒకవేళ దీని నిర్మాణం పూర్తయితే నౌకాయాన చరిత్రలోనే అతిపెద్ద క్రూజ్‌గా నిలుస్తుంది.
ఫ్రీడమ్ షిప్ అనేది సాధారణ క్రూజ్ మాదిరి (ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి తరలించడం) కాకుండా.. శాశ్వత నివాస స్థలంగా ఉండాలనే భావనతో రూపొందించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు 1990ల్లోనే ఇంజినీర్లు రూపకల్పన చేసినప్పటికీ.. ఫ్రీడమ్ క్రూజ్ లైన్ ఇంటర్నేషనల్ సంస్థ ఇటీవల సరికొత్త డిజైన్ విడుదలతో మరోసారి వార్తల్లో నిలిచింది. నివాస ప్రాంతాలతోపాటు చదువు, ఉద్యోగం.. చివరకు రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదించేలా అత్యాధునిక వసతులతో ఈ తేలియాడే నగరాన్ని నిర్మించాలనేది ప్రతిపాదన. విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, ఆఫీస్‌లు, పార్కులు, థియేటర్లు.. ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు ఉన్నాయి. అంతేకాదు.. 15వేల మంది సామర్థ్యం కలిగిన ఓ భారీ స్టేడియం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈనౌక 1.6 కి.మీటర్లకుపైగా పొడవు, 250 మీటర్ల వెడల్పు.. 25 అంతస్తుల మేర ఎత్తు ఉంటుందట.
ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద క్రూజ్ షిప్‌తో పోలిస్తే నాలుగైదు రెట్లు పెద్దది. 50వేల మంది శాశ్వత నివాసితులు, 20వేల మంది సిబ్బందితోపాటు పది వేల మంది పర్యాటకులు.. ఇలా మొత్తంగా 80వేల మందికి అవసరమైన సకల సౌకర్యాలు కల్పించనున్నారు. ఇంత పెద్ద నౌకకు నిరంతరం విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అణుశక్తిపై ఆధారపడే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 16 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.లక్షన్నర కోట్లు) కుపైగా ఖర్చు అవుతుందని అంచనా. సకల సదుపాయాలతో కూడిన ఈ నౌకలో ప్రపంచ జలాల్లో తిరగడం ఓ కొత్త జీవన విధానమేనని కొందరు అభివర్ణిస్తున్నారు. సకల వసతులు ఏర్పాటు చేయనున్నప్పటికీ.. ఈ ప్రాజెక్టులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయట. భారీ పరిమాణంలో ఉండడంతో ఇప్పుడున్న పోర్టుల్లో డాకింగ్ చేయడం సాధ్యం కాదు. తీర ప్రాంతాలకు వెళ్లాలంటే ఫెర్రీలు, చిన్న బోట్లు, హెలికాప్టర్ల సాయంతో వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఇది ఓ ప్రతిపాదిత ప్రాజెక్టు మాత్రమే. నిర్మాణ పనులు మొదలైతే.. దీన్ని పూర్తిచేసేందుకు నాలుగైదు ఏళ్ల పడుతుందని అంచనా.