మార్కెట్ విలువలే సవరించాం.. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచట్లేదు : మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను సవరించామని, అయితే రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను ఆరు శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందని, ఒక్క శాతం పెంచినా ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడుతుందనే ఉద్దేశంతోనే తాము చార్జీలుపెంచలేదన్నారు. ప్రజాకోణంలో ఆలోచించి, వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను మాత్రమే సవరించినట్లు వెల్లడించారు. గురువారం సెక్రటేరియెట్‌లో మంత్రి పొంగులేటి మీడియాతో చిట్‌చాట్ చేశారు.
అవినీతికి తావు లేకుండా, ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థలో సముల మార్పులకు తీసుకొస్తున్నామని, ఇందులో భాగంగానే ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, తప్పు చేస్తే ఎస్ఆర్వోలను ఉపేక్షించడం లేదన్నారు. ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో లాండ్స్ ఫ్రీగా ఇవ్వడం లేదని, ఒకవేళ రద్దు చేస్తే ప్రభుత్వం డబ్బులు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని, ఇది సాధ్యమయ్యే పని కాదని తేల్చి చెప్పారు.